యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కుంగిన ఫ్లోరింగ్

తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరి గుట్ట. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నాడు. గత కేసీఆర్ ప్రభుత్వం ఈ ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది. తిరుమల పుణ్యక్షేత్రాన్ని తలపించేలా పునర్నిర్మాణం చేసింది. దీని కోసం 1200 కోట్ల రూపాయలను దీనికి వెచ్చించింది. అయితే ఈ నిర్మాణం పూర్తయి మూడేళ్లు కూడా గడవకముందే నిర్మాణ లోపాలు బయటపడుతున్నాయి. తాజాగా దక్షిణ భాగం ప్రాకార మండప తిరువీధుల్లో 50 మీటర్ల మేర రెండు అంగుళాల లోతు వరకు ఫ్లోరింగ్‌ కుంగిపోయింది. పునర్నిర్మాణం జరిగి ఎంతో సమయం గడవక ముందే ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది.

గత ప్రభుత్వం 1.20 ఎకరాలు ఉన్న కొండను పూర్తిగా చదును చేసి ప్రధానాలయ ప్రాంగణాన్ని 4.20 ఎకరాలకు విస్తరింపజేసి దానిలో స్వామివారి ప్రధానాలయంతో పాటు సప్తగోపురాలను నిర్మించారు. ఆలయ పునర్మిర్నాణంలో భాగంగా ఆలయ దక్షిణ భాగంలో మట్టితో విస్తరించారు. దీంతో ప్రాకార మండపం వెలుపల ఉన్న ఫ్లోరింగ్‌ సుమారు 50 మీటర్ల పొడవున రెండు అంగుళాల లోతుకు కుంగింది. ఇలా జరగడం ఇది తొలిసారేమీ కాదు. విస్తరణ సమయంలోనూ ఇదే ప్రదేశంలో కుంగిపోగా అప్పట్లో మరమ్మతులు చేపట్టారు. కొద్దిపాటి వర్షానికే ప్రధాన ఆలయంలోని దక్షిణ రాజ గోపురం పక్కన కృష్ణశిలతో ఏర్పాటు చేసిన ఫ్లోరింగ్ బండలు రెండేళ్ల క్రితం కుంగిపోయాయి. దాదాపు 10 మీటర్ల మేర 3 ఇంచుల కిందకి కుంగాయి. ఇప్పుడు మళ్లీ 50 మీటర్ల పొడవున కుంగడం చర్చనీయాంశంగా మారింది.

Share this post with your friends