భగవన్నామస్మరణ ముక్తికి మార్గం: శ్రీ‌శ్రీ‌శ్రీ విశ్వ‌ప్ర‌స‌న్న‌తీర్థ‌స్వామీజీ

మాన‌వుల‌కు భగవన్నామస్మరణ ఒక్క‌టే ముక్తికి మార్గమని ఉడిపికి చెందిన పెజావ‌ర‌ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విశ్వ‌ప్ర‌స‌న్న‌తీర్థ‌స్వామీజీ ఉద్ఘాటించారు. శ్రీవారి పరమభక్తుడు, కర్ణాటక సంగీత పితామహుడు అయిన శ్రీపురందరదాసుల ఆరాధన మహోత్సవాలు టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మంగళవారం తిరుమలలోని ఆస్థాన మండ‌పంలో ఘనంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సందర్భంగా స్వామీజీ మంగళాశాసనాలు అందిస్తూ, భగవంతుని చేరాలంటే ముందు ఆయన పరమభక్తుల అనుగ్రహం అవసరమని పురాణాలు పేర్కొంటున్నాయని, ఈ కోవకు చెందిన పరమభక్తుడు శ్రీ పురందరదాసు అన్నారు.

నేడు వేలాది మంది భక్తులు పురందరదాసు రచించిన లక్షలాది కీర్తనలు ఆలపిస్తూ స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారని, ఇదే కలియుగంలో నామసంకీర్తనకున్న వైశిష్ట్యమన్నారు. దాససాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న భజన మండళ్ల సభ్యులను అభినందించారు. కొక్కె సుబ్రహ్మణ్య మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ మంగళాశాసనాలు చేస్తూ, శ్రీవేంకటేశ్వరుడు శ్రీ వైకుంఠం నుండి తిరుమలపై కాలుమోపి సకల జీవరాశులను రక్షిస్తున్నారని అన్నారు. ఇలాంటి పవిత్రమైన ప్రదేశంలో పురందరదాసుల ఆరాధన ఉత్సవాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు.

దాససాహిత్య ప్రాజెక్టు హైందవ సనాతనధర్మ ప్రచారానికి విశేషంగా కృషి చేస్తోందన్నారు. టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, 4.75 లక్షల సంకీర్తనలు రచించడం దైవాంశ సంభూతుడు, సాక్షాత్తు నారద స్వరూపులైన శ్రీ పురందరదాసుకే సాధ్యమైందని తెలిపారు. పురందరదాసు కీర్తనలు యావత్తూ లోకోక్తులేనన్నారు. మానవాళికి పురందరదాసు జీవితసారమే ఆదర్శప్రాయమన్నారు. అనంత‌రం స్వామీజీలను శాలువ‌, శ్రీ‌వారి ప్ర‌సాదంతో స‌న్మానించారు. అంతకుముందు ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప‌లు దాస సంకీర్తనలను భజన మండళ్ల సభ్యులు చక్కగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 3,500 మంది భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.

Share this post with your friends