
మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. రోజుకు కోటి మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించుకుని పుణ్యస్నానమాచరిస్తున్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు సైతం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లిన వారికి దర్శనమిచ్చి ఆనందం కలుగుజేస్తున్నాడు. మహాకుంభమేళాకు వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ కూడా శ్రీ మలయప్పస్వామి ఆలయం మాదిరిగానే నిత్య కైంకర్యాలను తిరుమల శ్రీవారి అర్చకులు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ప్రయాగ్‌రాజ్‌లోని శ్రీవారి నమూనా ఆలయంలోనూ భీష్మ ఏకాదశిని పెద్ద ఎత్తున నిర్వహించారు. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని లోకకల్యాణం కోసం శనివారం మధ్యాహ్నం టీటీడీ శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణాన్ని చేపట్టింది. దీనికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఇది పెద్ద ఎత్తున భక్తిభావాన్ని పంచింది. ముందుగా టీటీడీ వేద పండితులు విష్ణు సహస్రనామ స్తోత్రంలోని శ్లోకాలను పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ శివప్రసాద్, హెచ్ డీపీపీ అదనపు సెక్రటరీ శ్రీ రామ్ గోపాల్, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కృష్ణ శేషాచల దీక్షితులు, ముఖ్య అర్చకులు రవిచంద్ర దీక్షితులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
