పాక్‌లో రామాయణ నాటకం.. జనాల నుంచి విశేష స్పందన

రామాయణాన్ని భారత్‌లోనో.. లేదంటే మరే ఇతర దేశంలో ప్రదర్శించినా మనకు పెద్దగా ఆశ్చర్యమనిపించదు కానీ దాయాది దేశం పాకిస్థాన్‌లోని కరాచిలో ప్రదర్శిస్తే మాత్రం ఒకింత ఆశ్చర్యం వేయక మానదు. అది పూర్తిగా ముస్లిం దేశం. అక్కడ హిందువులంటే ఏమాత్రం పడదు. అలాంటి దేశంలో ‘రామాయణ’ గాథని నాటకంగా ప్రదర్శిస్తే మంచి ఆదరణ లభించడం విశేషం. దాదాపు మూడు రోజుల పాటు ప్రదర్శితమైన ఈ నాటకాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. అసలు అక్కడ నాటకం వేసే సాహసం చేసిందెవరు? అసలు నాటకం వేయడం ఎలా సాధ్యమైంది? అంటారా? తెలుసుకుందాం.

పేరు వినగానే ఉగ్రదాడులు, మత కల్లోలాలు గుర్తొచ్చే పాక్‌లో రామాయణ గాథ నాటకాన్ని వేయడం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. అక్కడ నాటకాన్ని వేసింది మరెవరో కాదు.. కరాచీకి చెందిన పైరులే. కరాచీ నగరానికి చెందిన యోగేశ్వర్ కరేరా, రాణా కజ్మాలతో పాటు మరికొందరు నాటక రంగంపై ఉన్న ఇష్టంతో థియేటర్ ఆర్ట్స్‌తో పాటు వివిధ విభాగాల్లో శిక్షణ తీసుకున్నారు. శిక్షణ పూర్తైన అనంతరం తమ బృందానికి ‘మౌజ్’ అని పేరు పెట్టుకుని గతేడాది నవంబర్‌లో తొలిసారిగా ఓ ఆర్ట్ గ్యాలరీలో రామాయణ నాటకాన్ని ప్రదర్శించగా మంచి స్పందన వచ్చింది. ఆ తరువాత రామాయణ నాటకాన్ని మరింత రమ్యంగా తీర్చిదిద్ది.. దానిని ఏఐ టెక్నాలజీతో మూడు రోజుల పాటు కరాచీలోని ఆర్ట్స్ కౌన్సిల్‌లో ప్రదర్శించారు. అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నాటకాన్ని ప్రదర్శించినందుకు తాము ఎలాంటి విమర్శలనూ.. బెదిరింపులనూ ఎదుర్కోలేదని మౌజ్ బృందం సభ్యులు తెలిపారు.

Share this post with your friends