ఈ గణేశుడికి దేశవిదేశాల నుంచి రాఖీలు..

ఉజ్జయిని నగరం ఆధ్యాత్మికతకు నెలవు. ఇక్కడ ఎన్నో ప్రఖ్యాతిగాంచిన ఆలయాలున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అయిన శ్రీ మహాకాళేశ్వర ఆలయం కూడా ఇక్కడే ఉంది. దీనికి సమీపంలో బడా గణేశుడు కొలువై ఉన్నాడు. ఈ ఆలయం ఈనాటిది కాదు.. 118 ఏళ్ల క్రితంనాటిది. ఆసక్తికర విశేషమేంటంటే.. ఈ వినాయకుడిని సోదరీమణులంతా తమ సోదరుడిగా భావిస్తారు. అందుకే ఈ విఘ్నేశ్వరుడికి మన దేశంలోని సోదరీమణులే కాకుండా విదేశాల నుంచి సైతం రాఖీలు పంపిస్తున్నారు. బడా గణేష్ వారం రోజుల ముందు నుంచి మొదలు నేటికీ రాఖీలు వస్తూనే ఉన్నాయి.

ఈ ఆలయం లోయలో ఉంటుంది. ఈ ఆలయానికి దేశం నలుమూలల నుంచే కాకుండా అమెరికా, సింగపూర్, హాంకాంగ్‌తో పాటు పలు దేశాల నుంచి రాఖీలు వచ్చినట్టు ఆలయ అర్చకులు చెబుతున్నారు. ప్రతి ఏటా బడా గణేశుడికి ఈ విధంగానే రాఖీలను సోదరీమణులు పంపుతుంటారట. రాఖీ పండుగ నాడు ఆ రాఖీలన్నింటినీ వేద మంత్రాలతో కడతారట. వాటన్నింటినీ కట్టేందుకు ఒక రోజు పడుతుందట. ఇక సోదరీమణులు రాఖీలతో పాటు పంపిన స్వీట్లను భక్తులకు ప్రసాదం కింద పంచుతారు. అంతా ఆదిదంపతులైన శివపార్వతులను తల్లిదండ్రులుగా భావిస్తారు. ఈ క్రమంలోనే వినాయకుడిని తమ సోదరుడిగా భావిస్తారు. అందుకే పిల్లల నుంచి వృద్ధుల వరకూ రాఖీలను బడా గణేశుడికి పంపిస్తారు.

Share this post with your friends