హిందువులు పెద్ద ఎత్తున కొలిచే దేవుడు, కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం పై నుంచి వాహనాలు వెళ్లడం నిషిద్ధమని తెలిసిందే. అయినా సరే పలు సందర్భాల్లో ఆలయంపై విమానాలు చక్కర్లు కొట్టిన ఘటనలు మనం చూశాం. తాజాగా కూడా ఇది మరోసారి రిపీట్ అయ్యింది. ఆలయ గోపురం పైనుంచి విమానం వెళ్లింది. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీ మలయప్ప స్వామివారి ఆలయం పైనుంచి వాహన రాకపోకలనేవి ఆగమ శాస్త్ర ప్రకారం నిషేధం. ఇలా చేస్తే ఆపదలు సంభవిస్తాయని ఆగమ పండితులు చెబుతున్నారు.
శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలకు సంబంధించి నిషేధం విధించాలని….అలాగే నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని పలుమార్లు టీటీడీ పాలకమండలి కేంద్ర పౌర విమానయాన శాఖకు విజ్ఞప్తి చేసింది. అయితే పక్కనే ఉన్న రేణిగుంట విమానాశ్రయానికి ట్రాఫిక్ రద్దీ పెరిగినందున నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించడం సాధ్యం కాదని కేంద్ర పౌర విమానయాన శాఖ చెబుతోంది. కానీ ఆలయ అధికారులు మాత్రం ఇలా ఆలయం పైనుంచి వాహనాలు ప్రయాణిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నాయి. ఈసారి ఈ విషయమై భక్తులు సైతం గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు.