
అన్నమయ్య జిల్లా తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయంలో ఇవాళ్టి నుంచి పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు అంటే ఈ నెల 16వ తేదీ వరకూ పవిత్రోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాల్లో భాగంగా ఆగష్టు 14న పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం, గ్రంధి పవిత్ర పూజ నిర్వహిస్తారు. ఆగష్టు 15న విఘ్నేశ్వరపూజ, యాగశాల పూజ, వేదికార్చన, పరివార దేవతలకు గ్రంధి పవిత్ర సమర్పణ, నివేదన, హారతి, లఘు పూర్ణాహుతి చేపడతారు. ఆగస్ట్ 16న పవిత్ర సమర్పణ, నిత్య పూజ, వేదికార్చన, నిత్య హోమం, పట్టు పవిత్ర పూజ, మహా పూర్ణాహుతి, పవిత్రవితరణ, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగనున్నాయి.
కార్వేటినగరంలో ఎప్పటి నుంచంటే..
కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగస్టు 19, 20వ తేదీల్లో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆగస్ట్ 19వ తేదీన ఉదయం ఆచార్య రుత్విక్వరణం, సాయంత్రం మృత్సంగ్రహణం, సేనాధిపతి తిరువీధి ఉత్సవం, పవిత్రోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 20వ తేదీన ఉదయం మూలవర్లకు తిరుమంజనం, పవిత్రాల సమర్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నుంచి 7 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహిస్తారు.
