మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలం..

పూర్వం నుండి ఎందరో మహనీయులు మెట్ల మార్గంలో తిరుమలకు నడిచివెళ్లి స్వామివారి కృపకుపాత్రులయ్యారని తిరుమల తిరుపతి దేవస్థానం అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు శ్రీ రాజ‌గోపాల‌రావు చెప్పారు. ఇలాంటి మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమన్నారు. టీటీడీ అన్న‌మాచార్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో శ్రీ‌మాన్ తాళ్ల‌పాక అన్న‌మాచార్యుల 522వ వ‌ర్థంతి మ‌హోత్స‌వాల‌లో భాగంగా మంగళవారం ఉద‌యం అలిపిరి పాదాలమండపం మెట్లోత్సవం వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా శ్రీ రాజ‌గోపాల‌రావు మాట్లాడుతూ శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ ఆనంద తీర్థ చార్యులు, అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు మ‌రియు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దాదాపు 700 మందికిపైగా భజనమండళ్ల సభ్యులు భజనలు చేసుకుంటూ తిరుమలకు చేరుకున్నారు.

Share this post with your friends