శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూన్ 30 నుంచి జూలై 02వ తేదీ వరకూ జరగనున్న సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకుని గురువారం వేడుకగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 7 నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు.

అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. మ‌ధ్యాహ్నం 12.30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. సాక్షాత్కార వైభవోత్సవాల్లో భాగంగా జూన్ 30వ తేదీన రాత్రి 07 – 08 గం.ల వరకు పెద్దశేష వాహనంపై, జూలై 01వ తేదీన రాత్రి 07 – 08 గం.ల వరకు హనుమంత వాహనంపై శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారు విహరించనున్నారు. జూలై 02వ సాయంత్రం 6.30 – 07.00 గం.ల మధ్య లక్ష్మీ హారాన్ని ఆలయ ప్రదక్షిణగా అలంకార మండపంలోకి తీసుకురానున్నారు. అదే రోజు రాత్రి 07 – 08.30 గం.ల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

Share this post with your friends