
శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం పంచమీ తీర్థం(చక్రస్నానం) అశేష భక్తజనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో స్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకిలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీ తీర్థ మండపానికి వేంచేపు చేశారు.
ఉదయం 12.15 నుండి 12.20 గంటల మధ్య పంచమి తీర్థం(చక్రస్నానం) ఘట్టం ఘనంగా జరిగింది. చక్రత్తాళ్వార్‌తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి తన్మయత్వం చెందారు. టీటీడీ అన్నప్రసాదం విభాగం విశేష సేవలు అందించినట్లు భక్తులు హర్షం వ్యక్తంచేశారు. తమిళనాడు , కర్నాటక, ఉమ్మడి చిత్తూరు, కడప , నెల్లూరు జిల్లాల నుంచి వచ్చిన భక్తులకు తిరుచానూరులో నాలుగు హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. నవజీవన్ ఆసుపత్రి, పూడి, ఎస్వీ హైస్కూల్, తోళ్లప్ప గార్డెన్ లలో ఏర్పాటు చేసిన హోల్డింగ్ పాయింట్లులో దాదాపు వందకు పైగా అన్నప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేశారు. హోల్డింగ్ పాయింట్లులో వేచియుండే భక్తులకు 5వ తేదీ రాత్రి నుంచి అన్నప్రసాదాలు, తాగునీరు, బాదంపాలు, కాఫీ, కదంబం , చెక్కెర పొంగలి, దద్దోజనం, బిస్కెట్లు, వెజిటబుల్ ఉప్మా పంపిణీ చేశారు. ఆయా హోల్డింగ్ పాయింట్లులో అక్కడే వేచి వుండేలా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. టీటీడీలోని అన్ని విభాగాలు, పోలీసులు , శ్రీవారి సేవకులు సహకారంతో పంచమి తీర్థం సందర్భంగా లక్షకు పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. దాదాపు 25 వేలకు పైగా బిస్కెట్ ప్యాకెట్ లను పంపిణీ చేశారు.
