ఖైరతాబాద్ వినాయకుడికి లక్ష రుద్రాక్ష మాల..

ఖైరతాబాద్ శ్రీ సప్త ముఖ మహా గణపతిని ప్రతి రోజు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. తెలంగాణ నుంచే కాకుండా మహా గణపతిని చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి సైతం భక్తులు వస్తున్నారు. ఆర్యవైశ్య సంఘం లక్ష రుద్రాక్ష మాలను సమర్పించింది. పవిత్ర పుణ్య క్షేత్రమైన కాశీ నుంచి ఈ రుద్రాక్ష మాలను తెప్పించారు. ఈ క్రమంలోనే భారీ ఊరేగింపుగా వాసవీ కేంద్రం నుంచి బయలుదేరి ఖైరతాబాద్‌కు వచ్చి గణపతికి లక్ష రుద్రాక్ష మాలను ఆర్య వైశ్యులు సమర్పించారు. ఆర్యవైశ్య సంఘం, ఖైరతాబాద్‌ అధ్యక్షుడు దేవరశెట్టి వీరేష్‌ గుప్తా, ప్రధాన కార్యదర్శి బెలిదె రాజు గుప్తా, సలహాదారులు కొండ్లె మల్లిఖార్జునగుప్త, కోశాధికారి ప్రకాష్‌ గుప్తా, ప్రతినిధులు అరుణార్తి మహేష్‌, గోపిశెట్టి ప్రవీణ్‌, మల్లికార్జున రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఖైరతాబాద్‌ భారీ గణపతి ప్రాంగణంలో నిన్న శివ పార్వతుల కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కల్యాణం తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత్‌, లింగబలిజ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కల్యాణోత్సవాన్ని వేద బ్రాహ్మణులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. గణపతికి ఒక వైపున అయోధ్య బాల రామయ్య, కుడివైపున శివపార్వతులు కొలువుదీరారు. అయితే శివపార్వతులకు సంబంధించి కళ్యాణ ఘట్టంతో కూడిన విగ్రహాలు ప్రతిష్టించారు. దీంతో శివపార్వతుల కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో జహీరాబాద్‌ ఎంపీ సురేష్‌ షెట్కార్‌, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు గణేష్‌ ఉత్సవ కమిటీ ప్రతి నిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Share this post with your friends