నాలుగు రోజులుగా ఓ పెద్ద పులి బుగ్గ దేవాలయ సమీపంలో సంచరిస్తున్నట్టు అటవీ సిబ్బంది గుర్తించింది. బుగ్గ రాజరాజేశ్వర ఆలయం తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయితీ పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది. తిర్యాణి అడవుల మీదుగా కన్నాల అటవీ ప్రాంతానికి వచ్చిన బీ2 అనే పెద్దపులి ఈ ప్రాంతంలో నాలుగు రోజులుగా సంచరిస్తోంది. పెద్ద పులి సంచారం కారణంగా అటవీ సిబ్బంది కన్నాల-బుగ్గ రహదారిని రాకపోకలు జరగకుండా మూసివేశారు. పులి కదలికలపై డ్రోన్ల సహాయంతో నిఘా పెట్టారు.
ఈ క్రమంలో తాజాగా పెద్దపులి శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి అతి సమీపంలో సంచరించినట్లు అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు. డ్రోన్ల సహాయంతో దీని కదలికలను గుర్తించారు. డ్రోన్ల సహాయంతో పులి కదలికలను తెలుసుకొని సిమెంటు రోడ్డు ప్రారంభానికి ముందే మట్టి రోడ్డుపై పెద్ద పులి పాదముద్రలను సేకరించారు. బుగ్గ దేవాలయ సమీపంలోనే పెద్ద పులి సంచరిస్తూ ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పెద్ద పులి సంచారం కారణంగా ఇవాళ బుగ్గ దేవాలయంలో నిర్వహించాల్సి ఉన్న అన్నదాన కార్యక్రమాన్ని నిలిపి వేస్తున్నట్లు బుగ్గ దేవాలయ చైర్మన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు తెలిపారు. అంతేకాకుండా ఈ ఆలయానికి పులి పట్టుబడేంత వరకూ భక్తులెవవరూ రావొద్దని ఆలయ అధికారులు సూచించారు.