
వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు జూలై 29 నుండి 31వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. జూలై 29న సాయంత్రం 6 గంటలకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. జూలై 30వ తేదీన ఉదయం యాగశాల పూజ, ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ, సాయంత్రం 6.30 గంటలకు శ్రీ సీతారాముల శాంతి కళ్యాణం, రాత్రి 8 గంటలకు హనుమంత వాహనసేవ నిర్వహించనున్నారు. జూలై 31న ఉదయం యాగశాల పూజ, ఉదయం 6.30 గంటలకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.
అనంతరం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరుగనుంది. సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవ, రాత్రి 8 గంటలకు గరుడ వాహనంపై శ్రీపట్టాభిరాముడు విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. అనంతరం మహాపూర్ణాహుతి, కుంభోద్వాసన, కుంభప్రోక్షణం నిర్వహించనున్నారు.
గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి శ్రీరామ పట్టాభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు.
ఆలయ ప్రాశస్త్యం
శ్రీ పట్టాభిరామస్వామి వారి ఆలయం చాలా పురాతనమైనది. జాంబవంతుడు ఇక్కడ సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్ను, హనుమత్ సమేత శ్రీ పట్టాభిరామ స్వామివారిని ప్రతిష్ఠించాడని ఇక్కడి స్థలపురాణం. ఈ ఆలయ ద్వారం ఉత్తర దిక్కుకు ఉన్నది. ఈ ఆలయం చోళుల శైలితో నిర్మించబడినది.
