తిరుమలలో నయా దందా.. ఆటోవాలాలకే ప్రాధాన్యం

తిరుమలలో మోసాలు, దందాలు పెద్ద ఎత్తున జరుగుతూనే ఉంటాయి. అప్రమత్తంగా ఉన్నామంటే అంతే సంగతులు. దర్శనం మొదలుకుని గదులు, ట్రాన్స్‌పోర్ట్ ఇలా అన్ని విషయాల్లోనూ దోపిడి జరుగుతూనే ఉంటుంది. తిరుమలలో నయా దందా ప్రారంభమైంది. తాజాగా శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా చర్చనీయాంశంగా మారింది. టైమ్ స్లాట్ దర్శన టోకెన్ల కోసం భక్తులు గంట తరబడి క్యూలైన్‌లో వేచి ఉండాల్సి వస్తోంది. టికెట్లు మాత్రం దళారులకు సునాయాసంగా దొరకుతున్నాయి. శ్రీవారిమెట్టు దగ్గర రోజూ 3 వేల టోకెన్లను టీటీడీ జారీ చేస్తుండగా.. అవన్నీ దళారుల చేతుల్లోకే వెళుతున్నాయనేది ప్రధాన ఆరోపణ.

ఆటో డ్రైవర్లు ముందుగానే ఒప్పందం చేసుకున్న వారికి నిర్ణీత సమయం దాటినా కూడా టోకెన్లు ఇప్పిస్తున్నారని తెలుస్తోంది. ఇదంతా టీటీడీ సిబ్బంది సహకరాంతో నిత్యం యథేచ్ఛగా సాగుతోంది. దీనిపై భక్తులు నిలదీస్తున్నా కనీసం సరైన సమాధానం చెప్పేవారు కూడా కరువయ్యారు. ముఖ్యంగా వారాంతాల్లో, సెలవు దినాల్లో తిరుమలకు భక్తులు పోటెత్తుతుంటారు. వీరిలో కొందరు నడక మార్గంలో తిరుమల కొండ ఎక్కుతుంటారు. తెల్లవారుజామునుంచే సుదూర ప్రాంతాల నుంచి వాహనాల్లో శ్రీవారి మెట్టు వద్దకు చేరుకుని నిరీక్షిస్తున్న భక్తులకు సమయం వృథా అవుతోంది తప్ప టికెట్లు దొరకడం లేదు. ఆటోల్లో వచ్చిన వారికి మాత్రం సునాయాసంగా టికెట్లు లభిస్తున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు.

Share this post with your friends