
భారతజాతి గర్వించదగ్గ జాతీయ నాయకులు, రాజనీతిజ్ఞులు, దళితుల జీవితాల్లో వెలుగురేఖలు నింపిన మహనీయుల జయంతి ఉత్సవాలను ఏప్రిల్ 5, 11, 14వ తేదీలలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 5న డా. బాబు జగ్జీవన్‌రామ్, ఏప్రిల్ 11న మహాత్మ జ్యోతిబా ఫూలే, ఏప్రిల్ 14వ తేదీన డా.బీ.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. మహతి ఆడిటోరియంలో ఉదయం 10.30 గంటలకు జయంతి సభ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులు జాతీయ నాయకుల జీవిత విశేషాలు, వారు సమాజానికి చేసిన సేవలపై ప్రసంగిస్తారు.
తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవారి పాదాల చెంత ఉన్న అలిపిరిలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని టీటీడీ భావిస్తోంది. అమరావతిలో తాజాగా జరిగిన సమీక్ష సమావేశంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి అలిపిరిలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలన్న అంశాన్ని తీసుకెళ్లారు. దీనికి చంద్రబాబు సైతం సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలోనే బేస్ క్యాంప్ నిర్మాణానికి 35 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని యోచిస్తున్నారు. గతంలో ఒబెరాయ్ హోటల్, దేవలోక్, ఎంఆర్‌కేఆర్ సంస్థలకు కేటాయించి.. ఇటీవల సీఎం ఆదేశాలతో రద్దు చేసిన 35 ఎకరాలను దీనికోసం వినియోగించాలని భావిస్తున్నారు.
