శ్రీశైలంలో ఇవాళ నాలుగోవ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని భ్రమరాంబికా మల్లికార్జున స్వామివారి ఆలయ అధికారులు, పూజారులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. శ్రీశైలంలోని చంద్రవతి కళ్యాణ మండపంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. ఈ వ్రతంలో పాల్గొనేందుకు 5 వందల మంది చెంచు ముత్తైదువులు, వేయి మంది సాధారణ మహిళలకు అవకాశం కల్పించారు. వరలక్ష్మి వ్రతంలో పాల్గొనే మహిళలకు పూజ సామగ్రితో పాటు మొదటిసారిగా చీరను కూడా దేవస్థానమే అందజేస్తోంది. వరలక్ష్మి వ్రతం అనంతరం మహిళలకు శ్రీస్వామి అమ్మవారి దర్శన ఏర్పాట్లతో పాటు అన్నదాన ఏర్పాట్లను సైతం ఆలయ అధికారులు చేశారు.
గత మూడు వారాలుగా శ్రీశైలంలో ఆయన అధికారులు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరిపిస్తున్నారు. ఇదే చివరి శ్రావణ శుక్రవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. దక్షిణ భారత దేశంలోనే సుప్రసిద్దమైన చదువుల తల్లి క్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలోనూ సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయి. మంచి ముహూర్తాలు మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో ఒకవైపు అక్షరాభ్యాసాలు, మరోవైపు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. మొత్తానికి బాసర సరస్వతీ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరుగుతున్నాయి. ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో భాస్కర్ రావులు ప్రత్యేక పూజలు చేసి వరలక్ష్మీ వ్రతాలను ప్రారంభించారు. 200 మంది మహిళలు వరలక్ష్మీ వ్రతాలను ఆచరించారు.