ఇళ్లలో మాత్రమే కాకుండా పలు ఆలయాల్లోనూ పెద్ద ఎత్తున వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించడం జరిగింది. ఆలయాల్లో అయితే సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అలాగే.. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామివారి మహాక్షేత్రంలోనూ పెద్ద ఎత్తున సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించడం జరిగింది.ఆలయ ఉత్తర భాగంలో గల చంద్రావతి కల్యాణ మండపంలో జరిగిన వరలక్ష్మి వ్రతంలో పది కాదు.. ఇరవై కాదు.. ఏకంగా సుమారు 15 వందల మంది మహిళ ముత్తయిదువులు పాల్గొన్నారు.
ఈ మహిళలందరికీ దేవస్థానమే పూజా సామగ్రిని ఉచితంగా సమకూర్చింది. ఆపై అర్చకులు వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రోక్తంగా వ్రత సంకల్పాన్ని నిర్విఘ్నంగా జరిపించారు. 1500 మంది మహిళలతో ఈ వ్రతం కన్నుల పండువగా జరిగింది. అనంతరం వ్రతంలో పాల్గొన్న మహిళలకు అమ్మవారి శేషవస్త్రంగా రవిక, పూలు, గాజులు, స్వామివారి ప్రసాదాన్ని అర్చకులు అందజేశారు. అనంతరం శ్రీ స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించారు. వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న మహిళలందరికి దేవస్థానం అన్నపూర్ణ భవనంలో భోజన ఏర్పాట్లు చేశారు.