
ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు నేడు అంటే ఫిబ్రవరి 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు.. అంటే మొత్తం 11 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ వేడుకల కోసం ఆలయ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైలం ఆలయం రంగురంగుల విద్యుత్ దీపాలతో పెయింటింగ్‌లతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు శ్రీశైలానికి తరలి రానున్నారు.
శ్రీశైలం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా భక్తుల సౌకర్యార్ధం దేవస్థానం అధికారులు విసృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండాకాలం కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తకుండా తాగునీరు, వసతి, వైద్యం, శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవారి దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు.. మినరల్ వాటర్ ప్లాంట్లు, ప్రసాదం తదితర ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేశారు. చాలా మంది ఈ సమయంలో పాదయాత్ర చేస్తూ శ్రీశైలనికి వస్తుంటారు. వీరి కోసం శ్రీశైలానికి 10 కిలోమీటర్లు దూరంలోని కైలాశ ద్వారం, భీముని కొలను, హటకేశ్వరం మెట్ల మార్గంలో వచ్చే భక్తులు సేద తీరేందుకు భారీ షెడ్లు, ఎక్కడికక్కడ తాగునీటి సౌకర్యం కల్పించారు.
