
తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద మొత్తం విరాళంగా అందింది. దాదాపుగా టీటీడీలోని పలు విభాగాలకు విరాళం అందుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా రూ.20 లక్షలకు పైగా శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌తో పాటు శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకాలకు విరాళం అందింది. విజయవాడలోని ఫార్ట్యూన్ ఫైన్ జ్యూవెలర్స్ కు చెందిన శ్రీ కోమటి సునీల్ ఈ విరాళాన్ని టీటీడీకి అందించారు. ఈ క్రమంలోనే శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,50,001 విరాళం అందించారు.
తాడేపల్లిగూడేనికి చెందిన శ్రీమతి మాతురు పంచాక్షరి శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకానికి రూ.10,00,116 విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు. అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కాగా.. తిరుమలలో వీకెండ్స్ కారణంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. అయితే వేసవి సెలవుల కారణంగా దాదాపు రెండు నెలలుగా తిరుమలలో విపరీతమైన రద్దీ నెలకొంది. అది ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది.
