ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు.. చార్‌ధామ్ యాత్రకు అంతరాయం

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా చార్‌ధామ్ యాత్రకు అంతరాయం ఏర్పడింది. కేదార్‌నాథ్, బద్రీనాథ్ మార్గాల్లో కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే చార్‌దామ్ యాత్ర నిర్వహిస్తున్న యాత్రికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. చిక్కుకున్నవారిలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఉన్నారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాకు చెందిన నలుగురు యాత్రీకులు ఉన్నారు. భారీ వర్షాల కారణంగా కేదార్‌నాథ్ యాత్రలో జిల్లాకు చెందిన నలుగురు యాత్రీకులు చిక్కుకున్నారు. సున్నా డిగ్రీ చలిలో వాతావరణం అనుకూలించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కొండ చరియలు విరిగిపడటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో భక్తులు ఉన్నారు. యాత్రీకుల్లో వృద్ధులు, చిన్నారులు కూడా ఉన్నారు. వారంతా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తమతో పాటు ఆంధ్రాకు చెందిన 20 మంది యాత్రీకులు ఉన్నారని జిల్లా వాసులు చెబుతున్నారు. తొలుత ఈ రోజు ఉదయం ఆరు గంటలకు హెలీకాఫ్టర్ పంపించాలని అధికారులు యత్నించినట్టుగా తెలుస్తోంది. కానీ వాతావరణం అనుకూలించకపోవటంతో ఆగిపోయారని సమాచారం. మరో రెండు రోజులు ఎక్కడి వారు అక్కడే ఉండవలసి వుందన్న అధికారుల సూచనతో యాత్రీకులు ఆందోళన చెందుతున్నారు.

Share this post with your friends