ఖైరతాబాద్ సప్త ముఖ మహా గణపతికి ప్రతి రోజూ నిర్వాహకులు, అర్చకులు ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నారు. శ్రీ సప్తముఖ మహాగణపతిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఐదో రోజు సైతం భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. నిన్న శివపార్వతుల కల్యాణం నిర్వహించిన విషయం తెలిసిందే. శివపార్వతుల విగ్రహాన్ని మహా గణపతి పక్కన పెట్టడం.. అలాగే ఆ విగ్రహం శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని సూచిస్తున్నట్టుగా ఉండటంతో నిన్న ఖైరతాబాద్ గణేషుడి వద్ద శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. ఇక ఈ రోజు ఖైరతాబాద్ మహా గణనాధునికి ఐదో రోజు పూజలు కొనసాగుతున్నాయి.
ఈ ఏడు ఖైరతాబాద్ వినాయకుడిని ప్రతిష్టించి 70 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా 70 హోమగుండాలతో లక్ష్మీ గణపతి పూజ, రుద్ర హోమం ఉత్సవ సమితి నిర్వహిస్తున్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో లక్ష్మి గణపతి, రుద్రాక్ష హోమం నిర్వహించారు. 70 హోమాల కార్యక్రమంలో దాదాపు 2080 జంటలు పాల్గొని రుద్ర హోమం నిర్వహించారు. ఖైరతాబాద్ వినాయకుడి ఉత్సవాలు నిర్వహించడం.. 70 వసంతాలు పూర్తవడంతో సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. 70 అడుగుల సప్త ముఖ మహా గణపతిని చూసేందుకు భక్తులకు రెండు కళ్లూ చాలడం లేదు.