
తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో కార్తీక మాసమంతా వివిధ రకాల పూజలు, హోమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం కృత్తికా దీపోత్సవం నిర్వహించారు. భక్తుల శివనామ స్మరణ-“హర హర మహాదేవ శంభో శంకర” అనే మంత్రోచ్ఛారణల మధ్య ‘కార్తీక దీపోత్సవం’ అత్యంత భక్తి పారవశ్యంతో జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతం వేగం కూడా పెరిగింది. దీంతో ఆలయంలోని పుష్కరిణిలోనికి భక్తులను అనుమతించరు.
ఈ క్రమంలోనే భక్తులంతా ఆలయ ప్రాంగణంలో మహిళలు నెయ్యి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 6 గంటలకు గర్భాలయంలో, ఆ తరువాత శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయ గోపురం, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ గోపురం, ధ్వజస్తంభంపైన దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఊంజల్ మండపంలో ఆకట్టుకునేలా శివలింగం, శూలం ఆకృతిలో ప్రమిదలు వెలిగించారు. ఆ తరువాత జ్వోలాతోరణం వెలిగించారు. ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీమతి గౌతమి, వీజీవో శ్రీమతి సదా లక్ష్మి, డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
