తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 10న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి 9.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టనున్నారు. ఈ కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను ఆలయ అధికారులు రద్దు చేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 16 నుంచి18వ తేదీ వరకూ పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగనున్నాయి. సెప్టెంబరు 15న సాయంత్రం పవిత్రోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. సెప్టెంబరు 16న పవిత్ర ప్రతిష్ఠ, సెప్టెంబరు 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 18న మహా పూర్ణాహుతి నిర్వహిస్తారు.
తిరుపతి నుండి 5 కిలోమీటర్ల దూరంలో తిరుచానూరు ఉంది. దీనిని అలమేలు మంగాపురమని కూడా అంటారు. తిరుచానూరు వేంకటేశ్వరుని ప్రియ సతీమణి శ్రీ పద్మావతి దేవి నివాసం. ఈ పుణ్యక్షేత్రం “అలిమేలు మంగాపురం” లేదా అలిమేలుమంగాపురం అని ప్రసిద్ధి చెందింది. ఆలయ పురాణం ప్రకారం, ఆలయ అవరణలో ఉన్న టాంక్ (పద్మసరోవరం) మధ్యలో పద్మావతి దేవి బంగారు కమలంపై మహాలక్ష్మి దేవిగా ఉద్భవించింది. కాబట్టి ఈ ప్రదేశం “అలమేలు మంగాపురం” పేరుతో ప్రసిద్ధి చెందింది. తీర్థయాత్రల సమయంలో తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించిన తర్వాతనే ఫలప్రదం కలుగుతుందని చెబుతారు.