10న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకొని సెప్టెంబరు 10వ తేదీన‌ ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 నుంచి 9.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 10 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతిస్తారు.

వేంకటేశ్వరుని భార్య అయిన పద్మావతి (అలమేలుమంగ) తిరుచానూరులో కొలువయ్యారు. ఈ ఆలయం తిరుపతి నగరంలోని తిరుచానూరు ప్రాంతంలో ఉంది. పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉపలయాలు కూడా ఉన్నాయి. కృష్ణ స్వామి ఆలయం, సుందరరాజ స్వామి ఆలయం పద్మావతి ఆలయంలో ఉప ఆలయాలు. క్రీ.శ. 1221 నాటి కృష్ణ స్వామి ఆలయం, ఆలయ సముదాయంలోని ఆలయాలలో అతి ప్రాచీనమైనది. సుందరరాజ స్వామి ఆలయం 16వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయంలో భూదేవి, శ్రీదేవి సమేత వరదరాజ స్వామి (విష్ణువు) కొలువయ్యారు. ఈ ఆలయ ట్యాంకు ఎదురుగా సూర్యనారాయణుని ఆలయం కూడా ఉంది. ఇక్కడి సూర్యనారాయణుని చిహ్నాన్ని వెంకటేశ్వరుడు ప్రతిష్టించాడని చెబుతారు.

Share this post with your friends