తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అక్టోబర్ 30వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో అక్టోబర్ 31వ తేదీ దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది.
ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 11 గంటల నుండి దర్శనానికి అనుమతిస్తారు.
దీపావళి ఆస్థానం
దీపావళి సందర్భంగా అక్టోబరు 31వ తేదీ రాత్రి 7 గంటలకు తిరుపతి శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం నుంచి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండరామస్వామివారికి సమర్పించనున్నారు. ఈ సందర్భంగా అమావాస్యనాడు ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకంసేవ, హనుమంత వాహనసేవను టిటిడి రద్దు చేసింది.