15న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 15వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే గురువారం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 19 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే.

ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు టీటీడీ అధికారులు ఈ బ్రహ్మోత్సవ ఏర్పాట్ల పనులను పరిశీలిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం, అలంకారము, శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఈ కారణంగా ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

Share this post with your friends