వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీలో భాగంగా జనవరి 8న జరిగిన తోపులాటలో మృతి చెందిన వారికి తిరుమల తిరుపతి దేవస్థానం పరిహారం అందజేస్తోంది. ఈ క్రమంలోనే రోజుకో కుటుంబానికి పరిహారాన్ని టీటీడీ సభ్యులు అందజేస్తున్నారు. నిన్న ఓ మహిళ కుటుంబానికి తాజాగా పరిహారం అందించారు. కేరళ రాష్ట్రం పాలక్కాడ్ కు చెందిన వి.నిర్మల కుటుంబానికి రూ.27 లక్షల పరిహారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు శనివారం అందజేశారు.
టీటీడీ పాలక మండలి నిర్ణయం మేరకు రూ.25 లక్షలు, టీ బోర్డు సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సొంత నిధులు రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.27 లక్షలు అందజేశారు. మృతురాలు నిర్మల ఏకైక కుమార్తె కౌశిగాకు పరిహారం చెక్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు శ్రీ. నరేష్ కుమార్, శ్రీ.రామ్మూర్తి, శ్రీ. శాంతారాం అందజేసి పరామర్శించారు. టీటీడీ పాలక మండలి నిర్ణయం మేరకు బాధితుల కుటుంబంలో ఒకరైన కౌశిగాకు టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చేందుకు వివరాలను బోర్డు సభ్యుల బృందం తీసుకున్నారు.