కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఇవాళ పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రేపటి వరకూ పవిత్రోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.
ఈ పవిత్రోత్సవాలలో భాగంగా ఆలయ నిర్వాహకులు, వేద పండితులు, అర్చకులు పలు కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆగస్టు 29వ తేదీన ఉదయం ఆచార్య రుత్విక్‌వరణం, సాయంత్రం మృత్సంగ్రహణం, సేనాధిపతి తిరువీధి ఉత్సవం, పవిత్రోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 30వ తేదీన ఉదయం మూలవర్లకు తిరుమంజనం, పవిత్రాల సమర్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహిస్తారు. దీంతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.