తిరుపతిలోని శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం కార్తీక వనభోజనాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఆలయంలోని కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం, ఆనంతరం ఆస్థానం నిర్వహించారు.
వన భోజనాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన వివిధ రకాల రుచికరమైన వంటకాలను తయారు చేయించింది. ఈ సందర్భంగా వన భోజనంలో ఆ వంటకాలన్నింటినీ భక్తులకు వడ్డించారు. శ్రీవారి వనభోజనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీ గోపినాథ్, సూపరిండెంట్ శ్రీ ముని బాలకుమార్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, శ్రీ ధనశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.