గోవిందరాజ స్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేక ఉత్సవాలు ప్రారంభం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం ఉత్సవాలు జరుగనున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఈ ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఆషాఢ మాసంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా స్వామివారిని ఉదయాన్నే మేల్కొలిపి వివిధ కార్యక్రమాలను శాస్త్ర ప్రకారం నిర్వహించడం జరుగుతుంది.

ఆదివారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి కైంకర్యాలు శ‌త‌క‌ల‌శ‌ స్న‌ప‌నం, మ‌హాశాంతి హోమం చేప‌ట్టారు. ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం స్వామి వారి కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాధివాసం చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు.

Share this post with your friends