
శ్రీవారి సేవలో పలు సంస్కరణలు తీసుకు వచ్చేందుకు చర్యలు చేపట్టామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్రీ జె.శ్యామలరావు అన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు, చేపట్టిన సంస్కరణలను పలువురు భక్తులు అభినందించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో 35 మంది భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు లడ్డూ సేవను 65 సంవత్సరాలు దాటిన వారికి ఇవ్వండి. పరకామణి సేవలో పాల్గొన్నవారికి ప్రతిరోజూ దర్శనం కల్పించాలని కోరాడు.
దీనికి ఈవో మాట్లాడుతూ.. పరకామణి సేవ చేసినవారికి ప్రతిరోజూ దర్శనం కల్పించడం సాధ్యంకాదు. లడ్డూసేవను గతంలో ప్రయత్నించినప్పటికి సరైన ఫలితాలు రానందున ఆపేయడం జరిగింది. మరో భక్తుడు.. జూలై నెలలో దర్శనాలకు అదనపు కోటా విడుదల చేసే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. ఆన్‌లైన్‌లో అదనపు కోటా విడుదల చేసే అవకాశం లేదని.. కరెంటు బుకింగ్ లో మాత్రమే దర్శన టోకెన్లు అందుబాటులో ఉంటాయని ఈవో తెలిపారు. సీనియర్ సిటిజన్ దర్శనాల్లో సహాయకులుగా మరొకరిని పంపించేందుకు వీలవుతుందా? అని భక్తుడు ప్రశ్నించగా.. అలాంటి అవకాశం ఉండదని.. సీనియర్ సిటిజన్లకు సహాయం అందించేందుకు శ్రీవారి సేవకులు అందుబాటులో ఉంటారని తెలిపారు.
