ప్రయాగ్‌రాజ్‌లో కన్నులపండువగా కొనసాగనున్న మహా కుంభమేళాకు వెళ్లాలనుకొంటున్నారా? మీకోసం ఐార్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. కుంభమేళాతో ఇతర ప్రాంతాలను సైతం చూసేలా ఐఆర్‌సీటీసీ ప్లాన్ చేసింది. జనవరి 17, 19, 24, ఫిబ్రవరి 2, 7, 14, 16, 21వ తేదీల్లో ప్రారంభమయ్యే ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
మొదటి రోజు ఉదయం 9:25 గంటలకు సికింద్రాబాద్ నుంచి యాత్ర ప్రారంభమై రెండో రోజు మధ్యాహ్నం 1.30గంటలకు వారణాసి చేరుకుంటారు. ముందుగా బుక్ చేసిన హోటల్‌కు చేరుకుని ఫ్రెష్ అయ్యాక అదేరోజు సాయంత్రం గంగా హారతి చూశాక.. రాత్రి భోజనం, బస అక్కడే. మూడో రోజు ఉదయం అల్పాహారం అనంతరం వారణాసిలో ప్రసిద్ధ ఆలయాలను దర్శించుకోవచ్చు. సాయంత్రం షాపింగ్, మీ వ్యక్తిగత పనులు చూసుకుని తిరిగి రాత్రి భోజనం, బస వారణాసిలోనే. నాలుగో రోజు టిఫిన్ చేశాక ప్రయాగ్‌రాజ్ బయల్దేరుతారు. మధ్యాహ్నానికి ప్రయాగ్‌రాజ్ శివారు ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడి నుంచి టెంట్ సిటీకి తీసుకెళ్తారు. ‘మహాకుంభ మేళా’ టెంట్ సిటీలోనే రాత్రి భోజనం, బస ఉంటుంది. ఐదో రోజు టిఫిన్ చేశాక చెక్ ఔట్ చేసి లగేజీని లాకర్ రూమ్‌లో పెట్టి త్రివేణి సంగమం, కుంభమేళాకు వెళతారు. సాయంత్రం ప్రత్యేక వాహనాల్లో ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌కు చేరుస్తారు. ఇక అదే రోజు రాత్రి 7.45గంటలకు సికింద్రాబాద్ (12792) ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కుతారు.
ఆరో రోజు రాత్రి 9.30గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు.
ఏ ఏ స్టేషన్లలో రైలు ఆగుతుందంటే..
సికింద్రాబాద్ నుంచి బయలుదేరి కాజీపేట, మంచిర్యాల, పెద్దపల్లి, రామగుండం, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్షా, సేవాగ్రామ్, నాగ్‌పుర్ రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది. ఈ ప్రాంతాల వారంతా తమకు అనువైన స్టేషన్‌లో రైలు ఎక్కొచ్చు. ఈ ట్రిప్ మొత్తం ఐదు రాత్రులు, ఆరు పగళ్లు.. యాత్ర ముగించుకున్నాక సికింద్రాబాద్‌లో దిగాల్సి ఉంటుంది.
ఒక్కో ప్రయాణికుడికి ఛార్జీలు ఎంతంటే..
థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్ ప్రయాణం రైలులో ఉంటుంది. థర్డ్ ఏసీలో ఒక్కో ప్రయాణికుడికి సింగిల్ షేరింగ్‌లో రూ.48,730, ట్విన్ షేరింగ్‌కు రూ.31,610, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.29,390 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, 5-11 ఏళ్ల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.22,890, విత్ అవుట్ రూ.14,650గా నిర్ణయించారు. ఇక సింగిల్ షేరింగ్‌కు స్లీపర్ క్లాస్‌లో రూ.45,700, ట్విన్ షేరింగ్ రూ.28,570, ట్రిపుల్ షేరింగ్ రూ.26,360 చొప్పున ఉండగా.. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.19,860, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ.11,620 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్యాకేజీని బట్టి ప్రయాణానికి ఏసీ గదులు, ప్రత్యేక షేరింగ్ వాహనాలు, మూడు రోజుల పాటు ఉదయం టిఫిన్, రాత్రి భోజనం ఉంటుంది. అలాగే ప్రయాణ బీమా వర్తిస్తుంది.