
ఈనెల 28వ తేది నిర్వహించనున్న టీటీడీ ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్(టీటీడీ ఎంప్లాయిస్ బ్యాంకు) ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ జేఈఓ (విద్య&ఆరోగ్యం) శ్రీమతి గౌతమి అధికారులను ఆదేశించారు. శుక్రవారం టీటీడీ పరిపాలన భవనంలో సంబంధిత అధికారులతో జేఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ తిరుమలలోని ఎస్వీ హైస్కూల్, తిరుపతిలోని ఎస్.జీ.ఎస్.హైస్కూల్ లో ఎన్నికల కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరుమలలో పని చేసే ఉద్యోగులు ఎస్వీ హైస్కూల్ లో, తిరుపతి, ఇతర ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులు ఎస్.జీ.ఎస్ హైస్కూల్ లో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రత్యేక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చని చెప్పారు. ఓటు వేసేందుకు వచ్చే ప్రతి ఉద్యోగి తమ ఒరిజినల్ ఐడీ కార్డు తప్పనసరిగా తీసుకు రావాలని అన్నారు. ఎన్నికల కేంద్రంలోకి సెల్ ఫోన్లు అనుమతించబడవనీ, సెల్ ఫోన్ల డిపాజిట్ కు ప్రత్యేక డిపాజిట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు జనరేటర్లు, మైకులను అందుబాటులో ఉంచుకుని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. విజిలెన్స్ విభాగం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని సెక్యూరిటీ గార్డులతో పాటు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. అలాగే టీటీడీ ఐటీ విభాగం, ఇంజినీరింగ్, సెక్యూరిటీ విభాగాలకు తమ విధులపై దిశానిర్దేశం చేశారు.
