తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన గురువారం ఉదయం చిన్నశేష వాహనసేవలో వివిధ రాష్ట్రల నుండి విచ్చేసిన కళాబృందాలు అద్భుత ప్రదర్శనలిచ్చాయి. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 12 కళాబృందాలు, 298 మంది కళాకారులు పాల్గొని తమ సంగీత నృత్య ప్రదర్శనలతో భక్తులను పరవశింప చేశారు. తమిళనాడు దిండిగల్ కు చెందిన 25 మంది కళాకారులు దిండిగల్ డ్రమ్స్ ను లయ బద్ధంగా వాయిస్తూ భక్తులను పరవశింప చేశారు. చెన్నైకి చెందిన సత్యప్రియ బృందం భరతనాట్యం, కేరళకు చెందిన 30 మంది మహిళ కళాకారులు మోహిని అట్టం నృత్యం ప్రదర్శించారు.
హైదరాబాద్ కు చెందిన 22 మంది మహిళలు వివిధ దేవతామూర్తుల వేషధారణ, భరతనాట్యం భక్తులను ఆకర్షించింది. అదేవిధంగా విశాఖపట్నంకు చెందిన 32 మంది చిన్నారులు, యువతులు మహిషాసుర మర్దిని నృత్య రూపకం, అమలాపురం శ్రీ అయోధ్య సీతారామ కోలాట భజన మండలికి చెందిన 28 మంది మహిళలు కోలాటం, హైదరాబాద్ రఘు రమ్య అకాడమీకి చెందిన 28 మంది కళాకారుల శ్రీనివాస కళ్యాణం, కేరళకు చెందిన కళాకారుల నవదుర్గల వేషధారణ భక్తులను పరవశింపజేసింది.