
నోములు, వ్రతాలనేవి నిత్యపూజలో భాగమేమీ కాదు.. అలాగని ఎప్పుడు, పడితే అప్పుడు చేసేవి కూడా కావు. ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి, శాస్త్రంలో నిర్దేశించిన సమయంలో మాత్రమే చేసుకుంటూ ఉంటాం. ఏ పని అయినా కూడా దీక్షగా, పట్టుదలతో చేస్తే దాన్ని వ్రతం అంటాము. శ్రావణ మాసం అనేది ఏడాది మొత్తంలో అత్యంత శుభ మాసం. ఈ మాసంలో ఏ వ్రతం ఆచరించినా ప్రయోజనం ప్రభావవంతంగా ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో ఎక్కువ వ్రతాలు ఆచరిస్తూ ఉంటాం. ఈ మాసంలో ఆచరించే వ్రతాలేంటంటే..
శ్రావణ మంగళ గౌరీ వ్రతం
శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. దీనిని శ్రావణ మంగళవార వ్రతం, మంగళ గౌరీ నోము అని కూడా అంటారు. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లైన మహిళలు ఆచరిస్తారు. శ్రావణ మాసం తొలి మంగళవారం నుంచి ప్రతి మంగళవారం ఈ వ్రతమాచరించాలి. మొత్తంగా ఐదు సంవత్సరాల పాటు ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ తరువాత ఉద్యాపన చేయాలి.
నాగపంచమి
శ్రావణమాసం శుద్ధ పంచమిని నాగ పంచమిగా జరుపుకుంటారు. ముఖ్యంగా సంతానం కోరుకునే వారు ఈ రోజును అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రతం ఉంటారు. ఈ రోజున ఉపవాసముండి నాగదేవతలను పూజించి పుట్టలో పాలు పోస్తే కుజ, నాగ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.
వరలక్ష్మీ వ్రతం
శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవికి ఈ వ్రతం గురించి వివరించాడని చెబుతారు.
