వినాయక మండపాలను అత్యంత సుందరంగా కళాత్మకంగా తీర్చి దిద్దారు. చాలా చోట్ల వినాయక మండపాలు భక్తులను చూపు తిప్పుకోనవ్వడం లేదు. ఒకచోట కాయిన్ వినాయకుడు, మరో చోట నోట్లతో వినాయకుడు, ఇంకో చోట కులవృత్తిని ప్రతిబింబించే వినాయకుడు.. ఇలా రకరకాల వినాయకులు భక్తులను మంత్ర ముగ్దులను చేస్తున్నారు. తాజాగా ప్రకృతిని ప్రతిబింబించేలా వినాయకుడిని రూపొందించారు. సిద్దిపేట పట్టణంలోని శంకర్ నగర్‌లో వీర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓ వినాయకుడిని రూపొందించారు.
వినాయక మండప డెకరేషన్ కోసం మర్రి ఊడలను వినియోగించారు. ఈ గణనాథున్ని చూస్తే సహజ సిద్ధమైన అడవిలో మర్రి ఉడల మధ్య వినాయకుణ్ణి ప్రతిష్టించినట్టుగానే అనిపిస్తోంది. అంతేకాకుండా మర్రి ఊడలకు కలర్ పుల్ లైటింగ్ ఏర్పరచారు. సాయంత్రం అయితే చాలు మర్రి ఊడలు లైటింగ్ నడుమ వినాయకుడు మెరిసిపోతున్నాడు. ఈ వినాయకుడిని చూసి భక్తులు సైతం పరవశించి పోతున్నారు. గణేష్ నగర్‌లోని హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసిన సిద్ది వినాయకుడిని రంగవల్లులతో అలంకరించారు. ఈ దృశ్యాలన్నీ చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదు.