వినాయక చవితి పండుగ కోసం గణనాధులు నెల ముందే సిద్ధమయ్యారు. ఇప్పటికే కొందరు విగ్రహాలను మండపాలకు చేర్చేశారు. అయితే మంగుళూరు నుంచి వినాయకుడు అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లాడు. కాలిఫోర్నియాలోని షేర్లేకర్ కుటుంబం మంగళూరులో వినాయకుడి విగ్రహాన్ని ఆర్డర్ చేసింది. మంగళూరు మన్నేగుడ్డ సమీపంలోని ఓ కుటుంబం దాదాపు కొన్ని దశాబ్దాలుగా గణేష్ విగ్రహాలను తయారు చేస్తోంది. వీరి నుంచి షేర్లేకర్ కుటుంబం వినాయకుడి విగ్రహాన్ని ఆర్డర్ చేసి వినాయకుడి విగ్రహాన్ని విమానంలో తమ ఇంటికి తెప్పించుకున్నారు. మంగుళూరులో గణేష్ విగ్రహ తయారీని 95 ఏళ్ల క్రితం డాక్టర్ మోహన్ రాయ్ ప్రారంభించారు.
ఇప్పుడు నాలుగో తరం ఈ విగ్రహ తయారీ పనులను నిర్వర్తిస్తోంది. ఈ కుటుంబానికి చెందిన పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నా కూడా విఘ్నేశ్వరుడి విగ్రహ తయారీని మాత్రం వీడలేదు. పర్యావరణ అనుకూలంగా మట్టితో విగ్రహాల తయారీ వీరి ప్రత్యేకత. వీరు విగ్రహం కొనుగోలుదారుల నుంచి డబ్బును డిమాండ్ చేయరు. కొనుగోలుదారులు వారికి తోచినంత డబ్బును ఇచ్చేసి విగ్రహాన్ని తీసుకుని వెళ్లిపోతారు. గణేశుడి జన్మనక్షత్రమైన చిత్త నక్షత్రం రోజున గణపతి విగ్రహాల తయారీని ఈ కుటుంబం ప్రారంభిస్తుంది. ఈ ఏడాది ఇప్పటికే వీరు 260 గణేశ విగ్రహాలను తయారు చేశారు. వీటన్నింటినీ దక్షిణ కన్నడ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగే గణపతి ఉత్సవాలకు తరలిస్తారు. ముఖ్యంగా వీరి విగ్రహాలకు విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. విదేశాల్లో ఉన్న వీరి కుటుంబ సభ్యులు సైతం ఒక్క రోజైనా ఈ విగ్రహ తయారీలో పాల్గొంటారట. మోహన్ రాయ్ వారసుల ఇల్లు వినాయక చవితి నేపథ్యంలో నిండుగా గణపతులతో కొలువుదీరి కనిపిస్తుంది.