కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి ఆలయం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది. ఈ ఆలయానికి దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. శ్రీ రాఘవేంద్ర మఠంను కుంభకోణం మఠం, విభుదేంద్ర మఠం, దక్షిణాది మఠం లేదా విజయేంద్ర మఠం అని పిలిచేవారు. మూడు ప్రధాన ద్వైత వేదాంత మఠాలలో ఈ మఠం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. మంత్రాలయం స్వామివారి మఠానికి కేవలం భారత దేశం నుంచే కాకుండా దేశవిదేశాలనుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలోనే విదేశీ నగదు కూడా హుండీలో భారీగానే చేరుతోంది.
నగదు మాత్రమే కాకుండా స్వామివారి హుండీలో బంగారం, వెండి కూడా పెద్ద మొత్తంలో భక్తులు సమర్పించారు. 2024 డిసెంబరు నెల 8 రోజులతో పాటు 2025 జనవరి 22 వరకు సంబంధించిన 30 రోజుల హుండీని మఠం తాజాగా వెల్లడించింది. గురు రాజాం గణ భవనంలో దేవదాయ శాఖ ఇనస్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య హుండీలను లెక్కింపు జరిగింది. దీనిలో భాగంగా.. రూ.4,80,33,154 నగదుతో పాటు 1780 గ్రాముల వెండి, 42 గ్రాముల 270 మిల్లిగ్రాములు బంగారం, వివిధ దేశాల డాలర్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.