
తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 7 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. అనంతరం ధ్వజావరోహణంతో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను దిగ్విజయం చేసిన టీటీడీ అర్చక స్వాములకు, అధికారులు, ఉద్యోగులు, జిల్లా, పోలీసు యంత్రాంగం, శ్రీవారి సేవకులు, మీడియా, భక్తులకు ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు. సెప్టెంబర్ 24న సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ మలయప్ప స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా 2026వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు ఆవిష్కరించారు.
ప్రపంచం నలుమూలల నుంచి బ్రహ్మోత్పవాలకు విచ్చేసిన లక్షలాది మంది భక్తులకు శ్రీవారి వాహన సేవల దర్శన భాగ్యంతో పాటు మూలమూర్తి దర్శనం కల్పించారు. గరుడసేవ రోజున హోల్డింగ్ పాయింట్ల ద్వారా ఈసారి అదనంగా 30వేలు, రీఫిల్లింగ్ ద్వారా 15వేల మందికి దర్శనం. బ్రహ్మోత్సవాలకు ఈ 8 రోజుల్లో 5.80 లక్షల మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోగా, రూ.25.12 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది. 26 లక్షల మంది భక్తులకు పైగా అన్న ప్రసాదాలు పంపిణీ చేశాం. 2.42 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 28 లక్షలకు పైగా లడ్డూల విక్రయం జరిగింది. ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా తిరుపతి నుంచి తిరుమలకు 14,459 ట్రిప్పుల ద్వారా 4.40లక్షల మంది, తిరుమల నుంచి తిరుపతికి 14,765 ట్రిప్పుల ద్వారా 5.22 లక్షల మంది భక్తులను చేరవేశారు.
