ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ముగింపు దశకు వచ్చినా కూడా భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇప్పటికే కోట్లాది మంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తూనే ఉన్నారు. మొత్తంగా 40 కోట్ల మంది ఈ మహాకుంభమేళాకు వస్తారని అంచనా వేస్తే ఇప్పటికే 50 కోట్ల మార్కును దాటేశారని యూపీ ప్రభుత్వం చెబుతోంది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ఈ మహాకుంభమేళా ముగియనుంది. శని, ఆదివారాలు వారాంతాన్ని వాహనాల నిషేధిత ప్రాంతంగా అధికారులు ప్రకటించారు.
ఎక్కువ దూరం నడిచి వెళ్లాల్సి వచ్చినా కూడా భక్తులు సంతోషంగానే వెళుతున్నారు. కుంభమేళా ప్రాంతమంతా ఇసుకేస్తే రాలనంత మంది జనంతో కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్ సంగం రైల్వే స్టేషన్ కూడా ఫిబ్రవరి 16 వరకు మూసివేశారు. అంతకుముందు, ఈ రైల్వే స్టేషన్ ఫిబ్రవరి 9 నుండి మూసివేశారు. ఈ ప్రాంతాన్ని వాహన రహిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత, భారీ రద్దీ కారణంగా భక్తులు అనేక కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. అయినా సరే సంతోషంగా భక్తుుల కుంభమేళాకు వెళుతుండటం గమనార్హం. మరో పది రోజులు కూడా సమయం లేకపోవడంతో భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.