
తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్‌లోని శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. సోమవారం కన్నుల పండువగా శివపార్వతుల కల్యాణాన్ని సప్త ముఖుడి వద్ద నిర్వహింాచరు. అలాగే భక్తులు స్వామివారికి లక్ష రుద్రాక్ష మాలను అలంకరించారు. ఇక వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వేలాది భక్తుల నడుమ నిన్న లక్ష్మీ గణపతి రుద్ర హోమం అంగరంగవైభవంగా నిర్వహించారు. ఖైరతాబాద్ బడా గణేష్ 70వ వార్షికోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 280 జంటలతో హోమం నిర్వహించారు. 70 హోమ గుండాల మధ్య ఈ లక్ష్మీ గణపతి రుద్ర హోమం నిర్వహించారు.
ఖైరతాబాద్ మహా గణనాధునికి ఆరో రోజైన నేడు సైతం పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీ సప్తముఖ మహాగణపతి వద్ద ఆరో రోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈరోజు ఖైరతాబాద్ ఉత్సవాలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఉదయం గణపతి హోమం, ప్రత్యేక హారతి అనంతరం భక్తులను దర్శనానికి ఉత్సవ సమితి అనుమతిస్తోంది. ఖైరతాబాద్ బడా గణేష్‌ను చూసేందుకు నగర నలుమూలలుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. ఈ రోజు సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఉత్సవ కమిటి నిర్వహించనుంది. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
