శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా ముగిసిన హోమ మహోత్సవాలు

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నెల రోజుల పాటు నిర్వహించిన హోమ మహోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. నెల రోజుల పాటు పెద్ద ఎత్తున హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 11 రోజుల పాటు రుద్రయాగం నిర్వహించిన మీదట నిన్న శ్రీ చండికేశ్వర స్వామివారి హోమం నిర్వహించారు. దీనికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఉదయం శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం జరిగింది. అనంతరం మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మ‌హాశాంతి అభిషేకం, కలశాభిషేకం, త్రిశూల‌స్నానం, అంకుర‌ విసర్జన నిర్వహించారు. సాయంత్రం లక్షదీపారాధన, పంచమూర్తులైన శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి, శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీచండికేశ్వరస్వామి వారికి ఆరాధన చేపట్టారు. ఆ త‌రువాత పంచమూర్తులు పుర‌వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో ఆల‌య‌ డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends