ఇక్కడ దసరా శరన్నవరాత్రులు ఒక్కరోజే..

దసరా శరన్నవరాత్రులు పేరులోనే ఉంది కదా.. నవరాత్రులని.. తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజించుకుంటాం. దేశం మొత్తం ఇదే తంతు.. ఒక్కచోట తప్ప. ఆ ఒక్కచోట ఒక్కరోజు మాత్రమే నిర్వహిస్తారు. ఆ ఒక్కరోజులోనే 9 రకాల పూజలను నిర్వహిస్తారు. ఇంతకీ అదెక్కడ? ఎందుకు ఒక్కరోజే నిర్వహిస్తారో తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్ లోని అసన్‌సోల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని.. ధేనువా గ్రామంలోని కాళీకృష్ణ ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవ పూజను ఒకరోజు మాత్రమే నిర్వహిస్తారు. చాలా కాలంగా ఇక్కడ ఇదే తంతు. తేజానంద బ్రహ్మచారి అనే సన్యాసి ఇలా ఒకరోజు మాత్రమే దసరా పూజను నిర్వహించే తంతును ప్రారంభించారు.

పశ్చిమబెంగాల్‌లోని దామోదర్ నదీ తీరాన కాళీకృష్ణ ఆశ్రమాన్ని తేజానంద బ్రహ్మచారి స్థాపించారు. ఆయనకు 1979లో అమ్మవారు కలలో కనిపించి నవరాత్రి పూజలను ఒకే రోజు చేయాలని సూచించారట. అమ్మవారి సూచన మేరకే మహాలయ అమావాస్య రోజే అన్ని పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలలో భాగంగా తొమ్మిది రకాల పవిత్ర పత్రాలతో నవపత్రికను తయారు చేస్తారు. దీనిని జలాభిషేకం చేసిన మీదట అమ్మవారి విగ్రహం ముందు ఉంచుతారు. జయ, విజయలతో కూడిన అమ్మవారి విగ్రహానికి పూజలు పూర్తైన మీదట నవపత్రికను నదిలో నిమజ్జనం చేస్తారు. విగ్రహం మాత్రం భక్తుల దర్శనార్థం అక్కడే ఉంటుంది కానీ ఎలాంటి పూజలు నిర్వహించరు.

Share this post with your friends