పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా గోష్పాద క్షేత్రం విలసిల్లుతోంది. ఏపీని వరదలు ముంచెత్తుతున్నాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ క్రమంలోనే గోదావరి వరద నీటిలో గోష్పాద క్షేత్రం సైతం చిక్కుకుంది. కొవ్వూరులోని ఈ క్షేత్రానికి పుణ్యస్నానాలు, అపరకర్మల నిమిత్తం ప్రతి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే వరద పోటెత్తడంతో ఆలయం చుట్టూ పూర్తిగా నీరు చేరింది. ఈ క్రమంలోనే అధికారులు భక్తులను అనుమతించడం లేదు. ఇక ఈ క్షేత్రానికి దేశ వ్యాప్తంగా పేరుండటంతో సమయంతో సంబంధం లేకుండా భక్తులు వస్తుంటారు.
ప్రతిరోజూ ఈ గోష్పాద క్షేత్రం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు వరద కారణంగా ఒక్కరు కూడా ఆలయంలోకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. భక్తులు ఎవరూ క్షేత్రం లోపలికి వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పుష్కరాల సమయంలో ఈ గోష్పాద క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ క్షేత్రం ఏకంగా ఒక కి.మీ. పొడవు ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. గోష్పాద ఆలయంలో అనేక ఉపాలయాలు ఉన్నాయి. శివాలయం, సాయిబాబా మందిరం, కృష్ణాలయం.. ఇలా దాదాపు 20 దేవాలయాలు కొలువుతీరి ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని గౌతమ మహర్షి ఆశ్రమ ప్రదేశంగా భావిస్తూ ఉంటారు.