
తిరుమలలో వేసవి సెలవుల కారణంగా విపరీతమైన భక్తుల రద్దీ నెలకొన్న విషయం తెలిసిందే. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు ఒకరోజంతా క్యూలైన్లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే తిరుమలలో భక్తులు తమ కాటేజీలకు వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఫ్రీ బస్సులు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో క్యాబ్‌ల వాళ్లు ఇష్టానుసారంగా భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆర్టీసీ ఉచిత బస్సు సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా తిరుమల కొండపై ధర్మ రథాల పేరిట ఎర్ర బస్సులు ఉచితంగా తిరుగుతూనే ఉంటాయి. ఇవి ఎలక్ట్రిక్ బస్సులు. ఇవి ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో తిరిగి పాత విధానాన్ని అమల్లోకి తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై కాటేజీలకు సైతం ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. అందువల్ల భక్తులు ఆ బస్సుల్లో ప్రయాణించి.. కాటేజీలకు చేరుకోవచ్చు. ఈ ఆర్టీసీ బస్సులు ఆలయ ముందు భాగం, ఎంబీసీ, పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్ నుంచి నడుస్తాయి. ఈ ప్రాంతాల్లో బస్సు ఎక్కితే తమ కాటేజీలకు చేరుకోవచ్చు.
