
కోరిన కోరికలు తీర్చే దైవంగా శ్రీశైలం మల్లన్నను భక్తులు కొలుచుకుంటూ ఉంటారు. తాజాగా భక్తులకు శ్రీశైలం దేవస్థానం అధికారులు శుభవార్త చెప్పారు. స్వామివారి దర్శనానికి నిత్యం వేల మంది భక్తులు వస్తుంటారు. ఈ ఆలయంలో స్వామివారి స్పర్శ దర్శనం ఉంటుంది. దీనిలో భాగంగా ఉచిత స్పర్శ దర్శనాన్ని పున: ప్రారంభించారు. ఇటీవల ప్రారంభించిన ఈ స్పర్శ దర్శనానికి భక్తుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే ఇక మీదట దర్శనానికి టోకెన్ పద్ధతిని ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఈ టోకెన్లను కూడా ఆన్లైన్లో జారీ చేస్తారు. దీంతో భక్తులు క్యూల్లో పడిగాపులు పడాల్సిన అవసరం లేదు.
గతంలో స్వామివారి భక్తులకు స్పర్శ దర్శనం ఉండేది. మధ్యలో దీనిని నిలిపివేశారు. ఇటీవలే శ్రీశైలం మహా క్షేత్రంలో మల్లన్న భక్తుల సౌకర్యార్థం జూలై 1వ తేదీ నుంచి స్పర్శ దర్శనం ప్రారంభించారు. ఈ స్పర్శదర్శనానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి స్పర్శ దర్శనానికి ఆసక్తిని కనబరిచారు. భక్తుల రద్దీ కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి స్పర్శ దర్శనంపై ఆలయ అధికారులు దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే భక్తులకు టోకెన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ టోకెన్లను ఆన్‌లైన్‌ను సైతం అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకూ ఈ టోకెన్లు అందుబాటులో ఉంటాయి. మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 3.45 గంటల వరకూ టోకెన్లు అమల్లో ఉంటాయి. www.aptemples.ap.gov.in , www.srisailadevasthanam.org వెబ్సైట్ల నుంచి ఈ ఉచిత స్పర్శ దర్శనం టోకెన్లు పొందవచ్చు.
