కుల వృత్తిని ప్రతిబింబిస్తున్న వినాయకుడు.. ఎక్కడంటే..

వినాయక నవరాత్రులు వచ్చాయంటే చాలు.. వీధి వీధినా గణపతి వెలుస్తాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయక విగ్రహాలు తొమ్మిది రాత్రుళ్ళు పూజలు చేస్తారు. అయితే ప్రతి ఏడు వివిధ రకాల రూపాలతో గణనాథులను ఏర్పాటు చేస్తూ భక్తులను నిర్వాహకులు ఆకట్టుకుంటారు. నిత్య పూజలు, అన్నదానాలు, భజనలతో వినాయక మండపాలు కళకళలాడుతున్నాయి. ఇక వివిధ రూపాల్లో కొలువుదీరిన వినాయకులు ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. నిర్వాహకులు వివిధ రకాల థీమ్‌లతో మండపాలను ఏర్పాటు చేయడమే కాకుండా వినాయకుడిని సైతం ఆసక్తికర రూపంలో ప్రతిష్టించారు.

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని కుమ్మరి(శాలివాహన) సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడ కుమ్మరి సంఘం వినాయకులు వారి కుల వృత్తిని ప్రతిబింబించేలా ప్రతిష్టించారు. దీంతో ఇక్కడి వినాయకుడు కుండలను తయారు చేస్తున్నట్లుగా దర్శనమిస్తున్నాడు. వినాయకుడి ఒక చేతిలో కుండ ఆకారంలోని పాత్ర, మరో చేతిలో కమ్మరి పరికరంతో విఘ్నేశ్వరుడి చేయి కదుపుతూ ఇక్కడ భక్తులకు దర్శనమిస్తున్నాడు. క్లుప్తంగా చెప్పాలంటే మట్టి పాత్రలు చేస్తున్న కమ్మరిగా వినాయకుడు.. ఆయనకు ఎదురుగా కుమ్మరి చక్రం.. కుల వృత్తులను కాపాడాలంటూ ఓ ఫ్లెక్సీ చాలా ఆసక్తికరంగా అనిపిస్తోందా దృశ్యం.

Share this post with your friends