
వినాయక చవితి వేడుకల కోసం మణ్యంలోనూ ఆకర్ణణీయమైన గణనాథులు కొలువుదీరారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అనంత పద్మనాభస్వామిలా గణనాథుడు కొలువుదీరి చూపరులను కట్టిపడేస్తున్నాడు. పార్వతీపురం పట్టణంలోని మోటుపర్తి వారి వీధిలో గణేశ నవరాత్రుల్లో భాగంగా అనంత పద్మనాభుడు, నేలమాలిగల నమూనాతో కూడిన ఆరు గదుల ఆకృతిలో మండప నిర్మాణం గావించారు. అలాగే ఒక గదిలో నాగబంధం సెట్టింగ్.. మిగతా గదుల్లో వజ్రాలు, వైడూర్యాలు, బంగారు ఆభరణాల రూపకల్పనతో ఆకట్టుకునేలా అలంకరించారు.
ఈ అనంత పద్మనాభ స్వామి గణపయ్యను చూడటానికి స్థానికులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అనంత పద్మనాభుడి ఆలయానికి వెళ్లలేని వారంతా ఈ సెట్టింగ్‌ను చూసి ఆనందిస్తున్నారు. గణపతి విభిన్న రూపం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తుతోంది. ఇప్పటి వరకూ ఎన్నో రూపాలకు చెందిన గణేశులను అయితే చూశారు కానీ ఇలా అనంత పద్మనాభుని రూపంలోనే కాకుండా ఆలయాన్ని పోలిన అద్భుతమైన సెట్టింగ్‌ను చూసేందుకు పార్వతీపురం ప్రాంతవాసులంతా ఆసక్తి కనబరుస్తున్నారు.
