ప్రస్తుతం గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి. రకరకాల విగ్రహాలు ప్రతి వీధిలోనూ పెట్టడం జరిగింది. వాటిలో కొన్ని విగ్రహాలు చాలా ఆసక్తికరంగానూ.. మనల్ని చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. వాటిలో వినాయక వెండి విగ్రహం ఒకటి. దీనిని ఉత్తర కర్ణాటకలో ఏర్పాటు చేయడం జరిగింది. కర్ణాటకలోని హుబ్లీలో వినాయక చవితి సందర్భంగా ఒక చోటే కాదండోయ్.. మూడు చోట్ల గణేశుడి వెండి విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ వెండి విగ్రహాలు హుబ్లీ నడిబొడ్డున ఉన్న సరఫగట్టి, శీలవంతర ఓణి, షింపిగల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు.
గత 65 ఏళ్లుగా హుబ్లీలో సరఫగట్టిలో వినాయకుడిని ప్రతిష్టిస్తూ వస్తున్నారు. ఇక వెండి విగ్రహ ఏర్పాటు కొత్తగా కాదు.. గత 14 సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్నారు. మూషిక సహిత 121 కిలోల వెండి గణపతిని సరఫగట్టిలో ప్రతిష్టించారు. ఇక హుబ్లీలోని శ్రీ వరసిద్ది వినాయక మందిరంలో గత 44 సంవత్సరాలుగానూ.. శీలవంతర ఓణిలో 24 ఏళ్లుగా వినాయకుడిని ప్రతిష్టిస్తున్నారు. ప్రభావలితో సహా మొత్తం 50 కిలోల వినాయకుడిని ప్రతిష్ఠించి.. 1.25 కిలోల బంగారు ఆభరణాలతో అలంకరించారు. షింపిగల్లిలో గత 60 ఏళ్లుగా వినాయకుడిని ఏర్పాటు చేస్తుండగా.. వెండి విగ్రహాన్ని మాత్రం 18 ఏళ్లుగా పెడుతున్నారు.