మన దేశంలోనే కాదు.. విదేశాల్లో పెద్ద ఎత్తున గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా వినాయకుడి గురించే చర్చ. ఈ తరుణంలో బాగా హైలైట్ అవుతున్నది థాయ్‌లాండ్ వినాయకుడు. ఎందుకంటే ఇక్కడి విఘ్నేశ్వరుడు వరల్డ్ ఫేమస్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశ్ విగ్రహం అక్కడుంది. థాయ్‌లాండ్‌లోని ఖ్లాంగ్ ఖ్వాన్ నగరంలోని గణేష్ ఇంటర్నేషనల్ పార్క్‌లో 128 అడుగుల ఎత్తుతో రాగి గణేశుడు కొలువుదీరాడు. ఏర్పాటు చేశారు. ఎత్తులో మాత్రమే కాదు ఆకర్షణీయమైన రూపంతోనూ వినాయయుడు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ గణపతికి కుడివైపు పై భాగంలో పనసపండు.. దిగువ కుడి చేతిలో అరటి పండు.. ఎడమ చేతిలో చెరకు గడ.. దిగువ ఎడమ చేతిలో మామిడి పండు మనకు కనిపిస్తాయి.
గణపతి విగ్రహాన్ని పోలీసు జనరల్ సోమ్‌చై వానిచ్సేని నేతృత్వంలోని చాచోంగ్‌సావో స్థానిక సంఘం సమూహం 854 వేర్వేరు భాగాలను కలిపి రూపొందించింది. ఈ గ్రూప్ ఛైర్మన్ 2009లో దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. థాయ్‌లాండ్‌లోని చచోయెంగ్‌సావోలోని క్లోంగ్ ఖువాన్ జిల్లాలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 40,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ వినాయకుడిని అక్కడి వారంతా తమ దేశ సంరక్షకుడిగా భావిస్తారు. మనం ఏ పనినైనా ప్రారంభించడానికి ముందు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు వినాయకుడిని పూజిస్తాం. థాయ్‌లాండ్ వాసులు కూడా అంతే.. వినాయకుడు తమ జీవితంలో అడ్డంకులను అధిగమించేలా చేసి తమ లక్ష్యాలను సాధించడానికి మార్గం చూపిస్తాడని భావిస్తూ ఉంటారు.